Tuesday, December 2, 2025

210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రయల్ రన్ ప్రారంభం.. 4 గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం

SHARE


దేశంలో మరో ప్రతిష్టాత్మకమైన హైవే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతోంది. ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మించిన ఈ 210 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం అయితే.. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం ఏకంగా 4 గంటలు తగ్గనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో కొంత సెక్షన్ పనులు పూర్తి కాగా.. ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ ఢిల్లీ-సహరాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


నరేంద్ర మోదీ సర్కార్.. అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ క్రమంలోనే హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల మధ్య ఈ హైవేలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి చేసుకుని.. ట్రయల్ రన్‌కు సిద్ధమైంది. ఉత్తర భారతదేశంలోనే కీలకమైన హైవే ప్రాజెక్టుల్లో ఒకటైన ఢిల్లీ-సహరాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక సెక్షన్ ట్రయల్ రన్ కోసం తెరిచారు. ఈ హై స్పీడ్ కారిడార్ పూర్తిస్థాయి ప్రారంభానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.


ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం 6 గంటల నుంచి ఆరున్నర గంటలు ఉండగా.. ఈ 210 కిలోమీటర్ల పొడవైన ఈ ఢిల్లీ-సహరాన్‌పూర్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి అయితే.. ప్రయాణ సమయం.. కేవలం 2 గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇది దేశ రాజధాని ఢిల్లీ నుంచి.. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి ప్రారంభం మధ్య 32 కిలోమీటర్ల పూర్తి చేసిన విభాగాన్ని ప్రారంభించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. 

SHARE

Author: verified_user